: ఇదో 'జాదూ' టీవీ
మాటీవీ, జెమినీ టీవీ, సోనీ టీవీ ఇలా ఎన్నో చానళ్ల ప్రసారాలను ఆ టీవీ యాజమాన్యాలకు తెలియకుండానే ఓ జాదూ విదేశాల్లో ప్రసారం చేస్తూ ఆదాయం పోగేసుకుంటున్నాడు. తమకు తెలియకుండానే తమ చానళ్ల కార్యక్రమాలు విదేశాల్లో ప్రసారం అవుతుండడంతో యాజమాన్యాలకు తల తిరిగిపోయింది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జాదూ టీవీ వ్యవహారం బయటపడింది. సికింద్రాబాద్ లోని తిరుమలగిరిలో ఓ ఇంటి నుంచి ఇదంతా సాగుతున్నట్లు వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అసలు నిందితుడు, జాదూటీవీ కేబుల్ నెట్ వర్క్ యజమాని సుమిత్ అహుజా పరారీలో ఉన్నాడు.
జాదూ టీవీ పేరుతో సుమిత్ అమెరికా సహా చాలా దేశాల్లో భారతీయులకు సెట్ టాప్ బాక్సులు విక్రయించాడని దర్యాప్తులో తేలింది. వీటి ద్వారా 150 చానళ్ల ప్రసారాలను అందిస్తానని అతడు చెప్పాడు. భారత్ లో ప్రసారమయ్యే ఆయా చానళ్ల కార్యక్రమాలు ఆరు సెకన్ల ఆలస్యంతో విదేశాలలో ప్రసారమయ్యేలా పరికరాలతో ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే, ఇందుకు చానెళ్ల అనుమతి మాత్రం తీసుకోలేదు. పైగా విదేశాల్లో ప్రసారం చేసినందుకు రాయల్టీ కూడా చెల్లించడం లేదు. దీంతో కొన్ని చానళ్లు పోలీసులను ఆశ్రయించాయి.