: కపాలం ముక్క పోగొట్టారు...కృత్రిమ కపాలం అమరుస్తారట!


వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోల్ కతాలో చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న అర్ణబ్ దత్తా (23) అనే యువకుడు తండ్రి మరణించడాన్ని తట్టుకోలేకపోయాడు. తాను కూడా తండ్రితో పాటే తనువు చాలిద్దామనుకుని జనవరిలో లేక్ గార్డెన్ అపార్ట్ మెంట్ పై నుంచి కిందకి దూకేశాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని రూబీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అతడి కపాలంలో కొంత భాగం తొలగించి తలకు శస్త్రచికిత్స చేశామని, కపాల భాగాన్ని తరువాత అమరుస్తామని వైద్యులు తెలిపారు. తీరా ఇప్పుడు ఆ కపాలం ముక్క అమర్చాలని వైద్యుల వద్దకు వెళ్లగా ఆ ముక్క కన్పించడం లేదని సమాధానమిచ్చారు. ఇప్పుడెలా అన్న అర్ణబ్ కుటుంబ సభ్యులకు కృత్రిమ కపాలం ముక్క అమరుస్తామని అంటున్నారు.

దీంతో అర్ణబ్ కుటుంబ సభ్యులు ఆ ముక్క సెట్ అవుతుందో లేదో, దాని కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శస్త్ర చికిత్స తరువాత ఆరోగ్య సమస్యలు సాధారణంగా ఉంటాయని, కపాలం ముక్క సరిపోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై అర్ణబ్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News