: ఇండియన్ మ్యూజిక్ అంటే వీటికీ మక్కువేనట!
భారతీయ సంగీతం అంటే ఇష్టంలేదని ఎవరైనా చెప్పగలరా? ప్రపంచవ్యాప్తంగా మన సంగీత విద్వాంసులకున్న పేరు ప్రఖ్యాతులు, మన సంగీతం పట్ల ఇతర దేశస్తులు చూపే ఆదరణ తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ మ్యూజిక్ అభిమానుల శ్రేణిలో మరో ప్రాణి జాతి కూడా చేరింది. చింపాంజీలు కూడా మన సంగీతానికి బాగా స్పందిస్తాయట. అదే, పాశ్చాత్య సంగీతానికి మాత్రం ఉలుకుపలుకు లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోతున్నాయట. పాప్, బ్లూస్ వంటి సంగీతం వినిపించినప్పుడు చింపాంజీలు పెద్దగా ఆసక్తిలేనట్టు ప్రవర్తిస్తున్నాయని ఆస్టిన్ లోని ఎమొరీ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు.
వరుసగా 12 రోజుల పాటు ప్రతి ఉదయం 40 నిమిషాల పాటు చింపాంజీలపై ఈ సంగీత ప్రయోగాలు నిర్వహించారు. 16 పెద్ద చింపాంజీలను రెండు గ్రూపులుగా విడదీసి, వాటిని ప్రత్యేక ఎన్ క్లోజర్లలో ఉంచి ప్రయోగాలు చేపట్టారు. ఇండియన్ మ్యూజిక్ తో పాటు ఆఫ్రికన్ మ్యూజిక్ వినిపించినప్పుడు ఈ చింపాంజీలు హుషారుగా కనిపించాయని... జపనీస్, పాశ్చాత్య సంగీతం వినిపించినప్పుడు నిరాసక్తంగా ఉండిపోయాయని తెలిపారు.