: ఇది కోనసీమ ప్రజల తీరు!


పచ్చని పంట పొలాలు... పొడవుగా పెరిగిన కొబ్బరిచెట్లు... ఎంత దూరం వెళ్లినా తనివితీరని ప్రకృతి సౌందర్యం కోనసీమ సొంతం. ఎవరు కనబడినా ఆప్యాయంగా పలకరించడం, ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో తెలుసుకోవడం పుట్టుకతో అబ్బిన మానసిక సౌందర్యం. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందర్నీ గౌరవంగా సంబోధించడం వారికే చెల్లిన సంస్కారం.

అలాంటి కోనసీమలో శుక్రవారం తెల్లవారుజామున నగరం గ్రామాన్ని ఏ పాడు చూపు సోకిందో తెలియదు కానీ నగరం వల్లకాడులా మారింది. తెల్లవారక ముందే మృత్యువు గ్రామాన్ని చుట్టుముట్టింది. చెట్టూ...పుట్టా...పిల్లా...పిచ్చుక అనే తేడా లేకుండా అన్నిటినీ భస్మీపటలం చేసింది.

చూసేందుకు బీభత్సంగా మరణించిన మనుషులు, కాలిన ఇళ్లు... అందుబాటులో ఉన్నది మాత్రం పరిమితమైన వైద్య, పోలీసు సిబ్బంది. సహాయక చర్యలకు చాలా సమయం పడుతుంది. ఇలాంటి చోట కోనసీమ సహజ సంస్కృతి అక్కడి వారిని ఊరికే ఉండనివ్వలేదు. చేయిచేయి పట్టారు. సొంత కుటుంబ సభ్యులకు జరిగిన ఆపదలా ముందుకు నడిచారు. పోలీసులు, వైద్యులతో సంబంధం లేకుండా సహాయక చర్యలు చేపట్టారు. మాంసపు ముద్దలుగా మారిన దేహాలను పోస్టుమార్టం కోసం వైద్యశాలకు తరలించే వాహనాల్లో పెట్టారు. కాలిన ఇళ్లను, సామాన్లను వేరు చేశారు.

బాధాతప్త హృదయంతో విలవిల్లాడుతున్న బాధితులకు తలో చేయి వేసి సహాయసహకారాలు అందించారు. ప్రమాదం జరగగానే కొందరు వాహనాల్లో బాధితులను తరలించే ప్రయత్నం చేశారు. బాధలో ఉన్న వారికి ఓదార్పునిచ్చేందుకు ప్రయత్నించారు. అన్నీ తామై సహాయం చేసిన స్థానికులను చూసి డీఎస్పీ వీరారెడ్డి అచ్చెరువొందారు. ప్రజలు ఇలా ఉంటే సమస్యలు సమసిపోతాయని వారిని ప్రశంసించారు.

  • Loading...

More Telugu News