: ప్రేయసి నిర్ణయం తప్పని ఇలా కూడా చెబుతారా?
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అనే నానుడి ఇలాంటి సందర్భాలకు చక్కగా సరిపోతుంది. ఓ పేద ప్రేమికుడిగా తను చేసిన ప్రపోజల్ ను తిరస్కరించిన తన ప్రియురాలి నిర్ణయం తప్పని చెప్పేందుకు 40 వేల డాలర్లు ఖర్చు చేశాడు ఓ కుర్రాడు. చైనాలో హు జియా యూన్ అనే యువకుడు 2007లో కళాశాల విద్య నాలుగో ఏడాది చదువుతుండగా ప్రేయసికి తన ప్రేమ విషయం చెప్పాడు. పనిలో పనిగా... అప్పటికి ఆమె ఆమోదించకపోయినా ఎప్పటికైనా తన ప్రేమను తెలుసుకుంటుందని, అప్పటి వరకు తాను ఎదురు చూస్తానని సవాలు విసిరాడు.
అప్పటికి యూన్ నిరుపేద. 'కనీసం సినిమా టికెట్టు కూడా కొనలేని నిన్నెలా ప్రేమించను?' అంటూ ఆమె అతని ప్రేమను నిర్లక్ష్యం చేసింది. అంతే, యూన్ కసిగా పట్టుదలతో గత ఏడేళ్లుగా శ్రమించాడు. జూన్ 27వ తేదీన బీజింగ్ లో విడుదలయ్యే నాలుగు ఐమ్యాక్స్ సినిమా హాళ్లలో విడుదలయ్యే 'ట్రాన్స్ ఫార్మర్స్' సినిమా టికెట్లు మొత్తం కోనేశాడు. తన నెల సంపాదనలో సగభాగాన్ని సినిమా టికెట్లు కొనేందుకు ఖర్చచేశానని, తన ప్రేయసి నిర్ణయం తప్పని చెప్పేందుకు తానీ నిర్ణయం తీసుకున్నానని యూన్ సామాజిక వెబ్ సైట్లో పేర్కొన్నాడు.
తన ప్రేయసి చూసేంత వరకు ఈ వార్తను ఇంటర్నెట్ వినియోగదారులు షేర్ చేసుకోవాలని యూన్ కోరాడు. ప్రతి ఫలంగా నగదు బహుమతితోపాటు సినిమా టికెట్లను ఉచితంగా అందిస్తానని వారికి ఆఫర్ ఇచ్చాడు.