: ఇరాక్ లో భారతీయులకు తీవ్రవాదుల నుంచి ప్రమాదంలేదు... స్థానికుల నుంచే ముప్పు!
ఇరాక్ లో భారతీయులకు సున్నీ తీవ్రవాదుల నుంచి ప్రమాదం లేదని, అక్కడి స్థానికులతోనే ప్రాణభయం ఉందని భారతీయ కార్మికులు తెలిపారు. ఇరాక్ స్థానికుల ఉపాధి అవకాశాలు భారతీయులు కొల్లగొడుతున్నారనే ద్వేషంతో రగిలిపోతున్నారని ఇరాక్ లో చిక్కుకుపోయిన కేరళీయుడు తెలిపారు. మిలిటెంట్ల దాడుల వల్ల ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ కంటే సందట్లో సడేమియాలా తమను ఏం చేస్తారా? అనే భయమే వెంటాడుతోందని, తక్షణం తమను రప్పించేందుకు చర్యలు తీసుకోండి అంటూ ఐఏఎన్ఎస్ కు ఫోన్ లో వివరించాడు.
ఇరాక్ వాసులు తమపై అత్యంత పాశవికంగా దాడులకు దిగుతున్నారని, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నామని వారు చెప్పారు. వారం రోజులుగా పనులు కూడా లేవని, తమను వీలైనంత త్వరగా రప్పిస్తే ప్రాణాలు మిగుల్తాయని, లేకుంటే తమ పరిస్థితి చెప్పలేమని వారు పేర్కొన్నారు.