: రైతు రుణమాఫీ చేస్తామని అబద్ధం చెప్పి ఉంటే అధికారంలో ఉండేవారం: జగన్
రైతు రుణమాఫీ చేస్తామనే అబద్ధం చెప్పి ఉంటే వైఎస్సార్సీపీ ఈవేళ అధికారంలో ఉండేదని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. కడపలో సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కసారి అబద్ధం చెప్పి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటే ఐదేళ్లకే ప్రజలు ఇంటికి పంపిస్తారని అన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ అబద్ధాలు, మోసాలు బట్టబయలుకానున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఓ సీఎంపై రెండేళ్లకు కానీ అసంతృప్తి కలుగదని, తాజా సీఎంపై 25 రోజులకే అసంతృప్తి కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు.
నిజమైన ప్రతిపక్షం అంటే పార్టీ ఫిరాయించిన ఎంపీ, ఎమ్మెల్సీలు కాదని, ప్రజలేనని జగన్ తెలిపారు. వారి మోసాలు వెల్లడైన రోజు ప్రజలే తిరగబడతారని ఆయన స్పష్టం చేశారు. ఇకపై కేసులు, ఒత్తిళ్లు చాలా వస్తాయని, అయినా కలసికట్టుగా ఉండి ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికి ప్రతిపక్షం పాత్ర ఇచ్చినా, భవిష్యత్ లో 160 స్థానాల్లో తమని గెలిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.