: ఐదేళ్ల బుడతడు లింబో స్కేటింగ్ లో రికార్డులు బద్దలుకొట్టాడు!
లింబో స్కేటింగ్ లో బెంగళూరుకు చెందిన ఐదేళ్ల బాలుడు గగన్ రికార్డు బద్దలుకొట్టాడు. ఈ బుడతడు 39 కార్ల కింది నుంచి అరనిమిషంలో లింబో స్కేటింగ్ పూర్తి చేసి గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నాడు. భారత్ లో లింబో స్కేటింగ్ లో ఈ రికార్డు సాధించిన అతి పిన్న వయస్కుడు గగన్. 29.8 సెకన్లలో 39 కార్ల కింద నుంచి అలవోకగా స్కేటింగ్ చేసిన గగన్... కారును తగలకుండా వీలైనంత తొందరగా వాటి కింద నుంచి స్కేటింగ్ చేయడం తన లక్ష్యమని చెప్పాడు. అన్నట్టు, ప్రపంచ రికార్డుల గురించి గగన్ కు అంతగా తెలియదు.
గగన్ తండ్రి సతీష్ వాషింగ్ మెషీన్లు రిపేరు చేసే ఓ సాధారణ మెకానిక్. రోజూ ఉదయాన్నే 5.30 గంటలకు గగన్ ను స్కేటింగ్ క్లాసులకు తీసుకెళ్లడంతో అతడి దినచర్య ప్రారంభమవుతుంది. మూడేళ్ల వయస్సు నుంచే ఈ చిచ్చర పిడుగు స్కేటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. గగన్ స్కేటింగ్ కోచ్ యతీష్ గౌడ మాట్లాడుతూ... బెంగళూరులో ఇప్పటివరకు ఏ తల్లి కూడా మూడేళ్ల వయస్సులో తన కుమారుడిని స్కేటింగ్ క్లాసుకు పంపించి ఉండదన్నారు. చిరుప్రాయంలోనే గిన్నీస్ లోకి ఎక్కిన గగన్ మున్ముందు మరిన్ని రికార్డులు సాధిస్తాడని ఆశిద్దాం.