: జుట్టు పెరిగేందుకు చిట్కాలివిగో..!
ఈ జనరేషన్ లో అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య జట్టు రాలిపోవడం. ఆడా, మగా తేడా లేకుండా కలవరపెడుతున్న ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు మనకు అందుబాటులో ఉండే వనరులే అద్భుత ఔషధాలుగా పనిచేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి, బంగాళాదుంప, కొత్తిమీర, క్యారెట్ల సాయంతో జట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చట. ఎలాగంటే...
1. ఓ ఉల్లిగడ్డను మెత్తగా పిసికి రసం తీసి దానికి రెండు టీ స్పూన్ల తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి 40-50 నిమిషాలపాటు ఉంచాలి.
2. రెండు మూడు బంగాళాదుంపలను మెత్తని గుజ్జులా చేసి దానికి ఓ టేబుల్ స్పూన్ తేనె, ఓ గుడ్డు పచ్చ సొన, కొంచెం నీరు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పూయాలి.
3. తాజా వెల్లుల్లి గడ్డల నుంచి రసం తీసి మాడుకు పట్టించాలి. తద్వారా జట్టు ఆరోగ్యంగా ఉండడమే గాకుండా కొత్తగా కూడా పుట్టుకొస్తుందట.
4. తరిగిన తాజా కొత్తిమీరకు నీటిని కలిపి పేస్టులా తయారుచేసి మాడుకు పట్టించాలి. గంటసేపటి తర్వాత శుభ్రంగా కడిగివేయాలి.
5. కొన్ని క్యారెట్లను బాగా ఉడికించాలి. వాటిని ఉడికించిన నీటితో సహా మెత్తగా రుబ్బాలి. ఆ పేస్టును తలకు పట్టించి అరగంట తర్వాత కడిగివేయాలి.
వీటిలో ఏ చిట్కాను ఫాలో అయినా కురులను ఆరోగ్యవంతంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు.