: సెల్ టవర్ నుంచి ఎంత రేడియేషన్ వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
మీ ఇంటికి, స్కూల్, కాలేజ్, ఆఫీసుకి దగ్గర్లో ఎక్కడైనా సెల్ టవర్ ఉందా? దాని నుంచి ఎంత రేడియేషన్ విడుదలవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ (ఈఎంఎఫ్) ఎమిషన్ వెబ్ సైట్ లోకి వెళ్లి చూడాల్సిందే. ఆ వెబ్ సైట్ లో దేశంలో ఉన్న ప్రతి ఒక్క సెట్ టవర్ గురించి లెక్కలతో సహా వివరంగా ఉంటుందని సెల్యూలార్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కోయ్) వెల్లడించింది. ఈ వెబ్ సైట్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికల్లా అందుబాటులోకి రానుంది.
సెల్ టవర్లు సురక్షితమా? కాదా? అనే విషయం నిర్థారించేందుకు టెలికం శాఖ, టెలికం పరిశ్రమ సంయుక్తంగా ఓ వెబ్ సైట్ పెట్టి అందులో పూర్తి వివరాలు ఉంచేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. రెండు నెలల్లో ఈ సైట్ టెస్టింగ్ పూర్తవుతుందని, ముందుగా పంజాబ్, హర్యానా, మహారాష్ట్రల్లో అమలు చేస్తామని కోయ్ తెలిపింది. అయితే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు తొమ్మిది నెలల సమయం పడుతుందని కోయ్ స్పష్టం చేసింది. దీంతో సెల్ టవర్లపై ఉండే అపోహలు తొలగిపోతాయని కోయ్ అభిప్రాయపడింది.