: నా పరిపాలన అంటే దొంగల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి: బాబు
తన పరిపాలన అంటే దొంగల గుండెల్లో రైళ్లు పరుగెడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. తన పాలనలో మంచోళ్లంతా గుండెలపై చేయి వేసుకుని నిశ్చింతగా నిద్రపోవచ్చని ఆయన అన్నారు. దొంగలపై కేసులు పెడతామని ఆయన స్పష్టం చేశారు. తన పరిపాలన ఎలా ఉంటుందో ట్రాక్ రికార్డు పరిశీలిస్తే తెలుస్తుందని బాబు సవాలు విసిరారు. అవినీతిని, అసమర్థతను తాను సహించనని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో, సభలో గందరగోళం నెలకొడనంతో, 'గుమ్మడి కాయల దొంగ అంటే వైఎస్సార్సీపీ నేతలు అనవసరంగా భుజాలు తడుముకుంటున్నారని' ఆయన అన్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో తానెవర్నీ వ్యక్తిగతంగా అనడం లేదని ఆయన తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఈ దశలో వైఎస్సార్సీపీ నేతలు కల్పించుకుని ఎప్పటి నుంచి విద్యుత్ ఇస్తారని ఆయనను నిలదీశారు. ఆ విషయం ప్రజలకు తెలుసని ఆయన పేర్కొన్నారు.