: శివుడి మూడోకన్ను దేన్ని సూచిస్తుందంటే..!
ఈ సృష్టి లయకారుడు, విలయకారుడు ఒక్కడే... శివుడు! శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. సర్వకోటి ప్రాణులు ఆయన కనుసన్నల్లో నడవాల్సిందే. ఈ అర్ధనారీశ్వరుడికి ఎన్నిపేర్లో..! త్రయంబక దేవుడన్నా, పరమేశ్వరుడన్నా, నీలకంఠుడన్నా, పార్వతీనాథుడన్నా అతడే. శివుడు త్రినేత్రుడు. ఆయన రెండు కళ్ళ నడుమ నుదుటిపై మరో కన్ను ఉంటుంది. అది ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. అది తెరుచుకుంటే ముల్లోకాలు భస్మీపటలం అవుతాయన్నది భక్తుల నమ్మిక. కుడివైపు కన్ను సూర్యుడిని, ఎడమవైపు కన్ను చంద్రుడిని సూచిస్తుంది. ఇక మూడో కన్ను అగ్నికి ప్రతిరూపం. రెండు కళ్ళూ భౌతికప్రపంచంలో శివుడి కార్యకలాపాలకు సూచికలు కాగా, మూడోకన్ను అగోచర ప్రపంచ వీక్షణకు ఉద్దేశించినదట.
ఈ విషయంలో మరికొన్ని వాదనలు కూడా ఉన్నాయి. వీటి ప్రకారం శివుని మూడో కన్ను జ్ఞానాన్ని సూచిస్తుందట. ఇక, బౌద్ధమతంలోనూ త్రినేత్రుడి ప్రస్తావన ఉంది. ఆయన ఫాలనేత్రం ఆధ్యాత్మిక వివేకానికి, జ్ఞానానికి ప్రతిబింబం అని బౌద్ధుల విశ్లేషణ. ఆధునిక ఆధ్మాత్మిక ప్రపంచంలో అయితే, శివుని మూడోకంటిని ఆత్మజ్యోతిగా అభివర్ణిస్తారు.