: అంజలి సమస్య పరిష్కరించేందుకు మేం రెడీ: సురేష్ బాబు


సంచలనం రేకెత్తించిన హీరోయిన్ అంజలి అదృశ్యం ఉదంతంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, నిర్మాతలకు డేట్స్ కేటాయించిన తర్వాత వ్యక్తిగత విషయాలు సాకుగా చూపుతూ షూటింగులకు గైర్హాజరవడం సబబు కాదని హితవు పలికారు. ఏవైనా సమస్యలున్నపుడు అంజలి ముందుకొస్తే పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సురేష్ బాబు చెప్పారు.

తన పిన్ని చిత్రహింసలు పెడుతోందంటూ రెండ్రోజుల క్రితం అంజలి మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ హిట్ 'బోల్ బచ్చన్' తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్, రామ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈరోజు నుంచి బెంగళూరులో ఆ చిత్రం షూటింగ్ ఆరంభమవ్వాలి. కానీ, ఆమె లొకేషన్ కు రాకపోవడంతో నిర్మాత సురేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే అంజలి ఈ రోజు ఉదయం తన తల్లికి ఫోన్ చేసి తన క్షేమ సమాచారం అందించింది. అయితే ఆమె ఎక్కడి నుంచి ఫోన్ చేసిందన్న విషయం తెలియరాలేదు. కాగా, మిస్సింగ్ కేసు ఉపసంహరించుకుంటున్నట్టు అంజలి సోదరుడు రవిశంకర్ తెలిపారు.

  • Loading...

More Telugu News