: గుడ్డు ధర వెరీ బ్యాడ్..!


చికెన్ కాదు కదా, కనీసం కోడిగుడ్డు తిందామన్నా సామాన్యుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం, కోడి గుడ్డు ధర రోజు రోజుకీ పెరిగిపోతోంది. హోల్ సేల్ మార్కెట్ లో ధర 100 గుడ్లకు రూ. 350గా ప్రకటించగా, చిల్లరగా ఒక గుడ్డు ధర నాలుగు రూపాయలకు చేరినట్టే! గత పది రోజుల్లో వంద గుడ్లపై సుమారు రూ.60 వరకు ధర పెరిగింది. ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు ఎండ తీవ్రతకు రెండు రాష్ట్రాల్లోని ఫారాల్లో కోళ్లు మేత తగ్గించేశాయి. దాంతో గుడ్ల ఉత్పత్తి పడిపోయింది. సాధారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రోజుకు 2 కోట్ల దాకా గుడ్లు ఉత్పత్తి అవుతాయి. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోటి, ఉత్తర కోస్తాలో 40 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతాయి.

ఎండల ప్రభావంతో ఉత్పత్తి 20 శాతం వరకు క్షీణించింది. ఉత్తర కోస్తాలో 32 లక్షలు ఉత్పత్తి అవుతుండగా, అందులో 60 శాతం వరకు స్థానిక అవసరాలకే సరిపోతున్నాయి. మిగిలిన 40 శాతం ఒడిశా, కోల్ కతా మార్కెట్లకు రవాణా అవుతాయి. అలాగే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా అధిక శాతం కోల్ కతాకు ఎగుమతి అవుతాయి. ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ కు తగ్గ సరఫరా లేదని 'నెక్' జాతీయ సభ్యుడు రామారావు తెలిపారు. వేసవి సీజన్ లో ఇది సహజ పరిణామమే అయినా, ఈసారి మరింత ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు మండుతుండటంతో గుడ్లకు డిమాండ్ పెరిగిందన్నారు.

  • Loading...

More Telugu News