: రుణమాఫీపై వెనక్కి తగ్గేది లేదు: యనమల
రైతు రుణమాఫీపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కష్టమైనా నష్టమైనా రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. కోటయ్య కమిటీ ఇచ్చింది మధ్యంతర నివేదిక మాత్రమేనని, పూర్తి నివేదిక వచ్చిన తరువాత సమగ్రమైన ప్రకటన చేస్తామని అన్నారు. మధ్యంతర నివేదికపై కేబినెట్ చర్చించిందని ఆయన తెలిపారు.
రుణాల విలువను కోటయ్య కమిటీ పూర్తిగా వెల్లడించిన తరువాత, ఎక్కువ మంది రైతులు లబ్దిపొందేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. గత ఏడాది బ్యాంకు రుణాలు చెల్లించిన వారికి కూడా లబ్ది చేకూరేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ లో బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకునేందుకు అనుకూలంగా, రీ షెడ్యూల్ చేయాలని కేంద్రానికి సూచించామని ఆయన తెలిపారు. రైతుల నుంచి పాత బాకీలు వసూలు చేయవద్దని, కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులను కోరామని ఆయన చెప్పారు.
25, 26న మంత్రులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానిని కలిసి రాష్ట్రంలో ఇబ్బందులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారని యనమల వెల్లడించారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేసేందుకు కావాల్సిన వనరులను సమకూర్చాల్సిందిగా ప్రధానిని కోరుతామని ఆయన చెప్పారు.