: పోలీసులు పని చేస్తున్నారా? లేదా? అని పరీక్షించా...గడుగ్గాయి నిర్వాకం
ఉత్తరప్రదేశ్ లో షమీమ్ అనే పదేళ్ల పిల్లాడు ఓ టీవీ సీరియల్ చూశాడు... అందులో హీరో జరగబోయే బాంబు ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందిస్తాడు. అంతే, పోలీసులు వచ్చి క్షణాల్లో బాంబును నిర్వీర్యం చేస్తారు. పోలీసులు నిజంగా అలా చేస్తారా? అనే అనుమానం ఆ బాలుడికి వచ్చింది. అంతే, ఇంట్లో ఫోనందుకుని 100కి డయల్ చేసి...'మా ఇంటి దగ్గర ఉప్పు ఫ్యాక్టరీ పక్కన బాంబు పేలింది' అంటూ సమాచారం ఇచ్చాడు.
దీంతో నిమిషాల్లో పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ టీం, క్లూస్ టీంలతో అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రదేశం అంతా పరిశీలించి బాంబు లేదని నిర్థారించారు. దీంతో ఫోన్ చేసింది ఎవరా? అని ఆరాతీస్తే పదేళ్ల గడుగ్గాయి ఫోన్ చేశాడని తేలింది. ఇలా ఎందుకు చేశావు? అని షమీమ్ ను ప్రశ్నిస్తే, టీవీ సీరియల్లోలా పోలీసులు వస్తారా? రారా? అన్నది తెలుసుకోవడానికి చేశానని తీరిగ్గా సమాధానం చెప్పాడు. దీంతో మళ్లీ ఇలాంటి పనులు చేయద్దని పిల్లాడికి వార్నింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు కూడా గట్టిగా చెప్పి పోలీసులు తమ స్టేషన్ కి వెళ్ళిపోయారు.