: బాలీవుడ్ నటి రెండు గంటల నిర్బంధం
బాలీవుడ్ నటి రిచా చద్దాను ఢిల్లీ విమానాశ్రయ భద్రతాధికారులు, కస్టమ్స్ అధికారులు రెండు గంటలపాటు నిర్బంధించి ప్రశ్నించారు. చెక్ ఇన్ సందర్భంగా చేసిన సోదాల్లో రిచా చద్దా బ్యాగ్ లో ఉన్న ఓ వస్తువుపై అనుమానం తలెత్తడంతో అధికారులు ఆమెను నిర్బంధించారు. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు సంప్రదాయపద్దతుల్లో తయారైన ఆయుర్వేద పౌడర్ ను వినియోగిస్తున్నట్టు ఆమె వివరణ ఇచ్చినా అధికారులు తృప్తి చెందలేదు.
దీంతో ఆమెను రెండు గంటల పాటు నిర్బంధించినట్టు ఆమె వెల్లడించారు. ఆయుర్వేద వస్తువులపై తనకు నమ్మకం ఎక్కువని, ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిన ప్రతిసారీ ఆయుర్వేద వస్తువులు వెంటతీసుకెళ్లడం సాధారణమేనని, అయితే, ఆయుర్వేద వస్తువు కారణంగా ఇబ్బంది పడడం ఇదే తొలిసారని ఆమె చెప్పారు.
ఆ పౌడర్ డబ్బా ఓపెన్ చేస్తే నిల్వ చేయడం కష్టమని, అందుకే దానిని ఓపెన్ చేసేందుకు నిరాకరించానని తెలిపిన ఆమె, రెండు గంటల సేపు అధికారులకు దాని గురించి వివరించినా వారిని ఒప్పించలేకపోయానని, తప్పనిసరి పరిస్థితుల్లో దానిని తెరచి చూపేందుకు అంగీకరించానని తెలిపారు. 'గోలియోంకా రాస్ లీల రామ్ లీల' సినిమాలో దీపికా పదుకునేకు వదినగా రిచా చద్దా నటించింది.