: అంజలికి ఎవరో బ్రెయిన్ వాష్ చేశారు: పిన్ని భారతీదేవి
హీరోయిన్ అంజలి మిస్సింగ్ కేసులో ఆమె పిన్ని ఓ టీవీ చానల్ తో మాట్లాడారు. అంజలికి ఎవరో బ్రెయిన్ వాష్ చేయడంతోనే ఇలా ప్రవర్తిస్తోందని ఆమె ఆరోపించారు. కాగా, అంజలిని చిన్నతనంలోనే తాను దత్తత తీసుకున్నట్టు ఆమె పిన్ని భారతీదేవి తెలిపారు. అంజలి తల్లి పార్వతీదేవి కోరికపైనే హీరోయిన్ చేశామని చెప్పారు. 15 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు అంజలిని ఓ కాలేజీలో చేర్చితే, పలు కారణాలతో అక్కడ చదువు మానేసిందని భారతీదేవి వెల్లడించారు.
అనంతరం చెన్నయ్ తీసుకెళ్ళి హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలుపెట్టామని, ఆ సమయంలో అంజలి ఇక తన తల్లి వద్దకు వెళ్ళనని చెప్పిందని చెప్పుకొచ్చారు. అంజలి 2006 లో మొదటి సినిమాలో నటించిందని చెబుతూ, ఆ సినిమాకు పారితోషికం తీసుకోలేదని వివరించారు. ఆ తర్వాత ఒక్కో సినిమాకు పారితోషికం పెరుగుతూ వచ్చినా.. ఆస్తుల గురించి మాట్లాడేంత స్థాయి ఇంకా అంజలికి రాలేదని భారతీదేవి వ్యాఖ్యానించారు.
తమిళ దర్శకుడు కలంజియంతో కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టాననడం అవాస్తవమని భారతీదేవి చెప్పుకొచ్చారు. కలంజియం ఎప్పుడూ తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోలేదని ఆమె అన్నారు. ఖర్చులకు కూడా డబ్బులు లేవని అంజలి మీడియాతో పేర్కొనడంపై మాట్లాడుతూ, 'డబ్బుంది కదా అని ఉన్న డబ్బులంతా పర్సులో పెట్టుకుని తిరగం కదా?' అని వ్యాఖ్యానించారు. ఇక తాము అంజలిని హీరోయిన్ గా చేశామన్న కృతజ్ఞతతో ఆమె పారితోషికాన్ని మూడు భాగాలు చేసి తీసుకుందామని తన సోదరి పార్వతీదేవి సూచించిందని.. ఇప్పటికీ అదే సూత్రాన్ని అనుసరిస్తున్నామని భారతీ దేవి వెల్లడించారు.
16 ఏళ్ళ కొడుకును నిర్లక్ష్యం చేసి మరీ అంజలి కోసం అప్పులు చేశానని, ఆమె పారితోషికంలో వాటా ఆశించడంలో తప్పులేదని భారతీదేవి సమర్థించుకున్నారు. అంతేగాకుండా, గతంలో అంజలి పలు అనవసర సమస్యల్లో చిక్కుకుందని, ఓ తమిళ హీరోతో లవ్ ఎఫైర్ కూడా నడిపిందని తెలిపారు. ఇక తన చెల్లి కనిపించడం లేదంటూ కేసు పెట్టిన అంజలి సోదరుడు రవిశంకర్ ఓ విలన్ అని భారతీదేవి ఆరోపించడం గమనార్హం. అంజలి గురించి చెప్పాల్సినవి చాలానే ఉన్నాయన్న ఆమె.. అంజలి కనిపిస్తే తక్షణమే ఆమెను తన సోదరి పార్వతీదేవికి అప్పగిస్తానని పేర్కొన్నారు.