: టీవీ 9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేయడం అప్రజాస్వామికం: బీజేపీ
టీవీ 9, ఏబీఎన్ టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేయడం అప్రజాస్వామికమని తెలంగాణ బీజేపీ అభిప్రాయపడింది. హైదరాబాదులో బీజేపీ ప్రతినిధి రామచంద్రరావు మాట్లాడుతూ, టీవీ 9, ఏబీఎన్ ఛానెళ్ల నిలుపుదల ఎమర్జెన్సీని తలపిస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మీడియా చేసిన సేవలను విస్మరించి, రాజకీయ పార్టీ అండ ఉందని ఎంఎస్ వోలు ఛానెళ్లని నిలిపి వేయడం సరికాదని హితవు పలికారు. పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రతీకార చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు. టీవీ ఛానెల్ క్షమాపణలు చెప్పిన తరువాత కూడా ఆయా ఛానెళ్లను నిలిపేసి, ఆంధ్రా ఛానెళ్లుగా పేర్కోవడం ఎంఎస్ వో మాఫీయా తీరుతెన్నులను తెలుపుతోందని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ దురహంకారంతో పత్రికా స్వేచ్ఛను హరిస్తే తెలంగాణకు జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని ఆయన హెచ్చరించారు. చేసే ప్రతి పనికి తాళం వేయాలంటే కుదరదని, నేతల పనుల్లో తప్పులను మీడియా కాకుండా ఏ సంస్థలు ఎత్తి చూపుతాయని ఆయన ప్రశ్నించారు. కేబుల్ చట్టంలో ఎంఎస్ వోల పాత్రపై స్పష్టమైన విధివిధానాలు ఉన్నాయని, వాటికి లోబడి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.