: కలెక్టర్ ఆలోచన... 400 మీటర్ల పొడవైన రేడియల్ రోడ్డు
ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న కలెక్టర్ ఆలోచన ఛత్తీస్ గఢ్ లోని సుర్గూజా జిల్లాలోని అంబికాపూర్ కు సమీపంలోని భగవాన్ పూర్ లో 400 మీటర్ల రోడ్డుకు ప్రాణం పోసింది. పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించి, పర్యావరణాన్ని రక్షించాలనే ఆలోచన సుర్గూజా జిల్లా కలెక్టర్ రీతు సేన్ కు కలిగింది. రోజు రోజుకు అధికమవుతున్న ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పలితాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు.
దీంతో అధికారులు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పిస్తూనే ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఇలా సేకరించిన వ్యర్థాలను కరిగించగా 3 క్వింటాళ్ల గ్రాన్యూల్ (ముడి) తయారైంది. దీంతో అంబికాపూర్ సమీపంలోని భగవాన్ పూర్ ప్రాంతంలో 400 మీటర్ల పొడవైన రేడియల్ రోడ్డును వేశారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తారు రోడ్ల కంటే ప్లాస్టిక్ రోడ్లు ఎంతో నాణ్యమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.