: షర్మిలపై వెబ్ సైట్లలో దుష్ప్రచారం...అదుపు చేయండి: వైవి సుబ్బారెడ్డి


వైఎస్సార్సీపీ నేత వైఎస్ షర్మిలను కించపరుస్తూ వెబ్ సైట్లలో దుష్ప్రచారం నడుస్తోందని, దానిని అరికట్టాలని ఆ పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, సోమయాజులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, షర్మిలపై గత కొంత కాలంగా సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం జరుగుతోందని అన్నారు. వ్యక్తీకరించలేని రీతిలో ప్రచారం చేస్తున్నారని, 20-25 వెబ్ సైట్లు పనిగట్టుకుని ఈ ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ కు అండగా నిలబడి పార్టీని బలోపేతం చేస్తున్నారనే దుగ్ధతో షర్మిలపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. దుష్ప్రచారానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుని, అటువంటి వెబ్ సైట్లను అదుపుచేయాలని ఆయన సూచించారు. దీనిపై సైబర్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని సీపీ మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. కాగా, షర్మిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసిన ఇద్దరు యువకులను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

అంబర్ పేట్ శంకర్ నగర్ కు చెందిన వెబ్ డిజైనర్ శ్రీపతి నరేష్, వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన కార్మీక్ మరో ఇద్దరితో కలసి మూడు నెలల క్రితం ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీంతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం జోరుగా నడుస్తోంది.

  • Loading...

More Telugu News