: దేశంలో అత్యధికంగా సిగరెట్ వినియోగిస్తున్న కోల్ కతా
దేశ వ్యాప్తంగా అత్యధికంగా సిగరెట్ వినియోగిస్తున్న నగరం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా అని తేలింది. ఈ క్రమంలో ముంబయికి చెందిన ఒక్కో వ్యక్తి రోజుకు ఆరు నుంచి ఏడు సిగరెట్స్ కాలిస్తే, కోల్ కతాలో ఒక్కో వ్యక్తి రోజుకు 9 నుంచి 10 సిగరెట్స్ కాలుస్తున్నారని 'ఐసిఐసీఐ లోంబార్డ్ టొబాకో కన్సమప్షన్ హాబిట్స్ 2014' సర్వే చెబుతోంది. ఇలా 44 శాతం మంది ప్రజలు రెండు, మూడేళ్లలో సిగరెట్ వినియోగాన్ని మరింత పెంచారని, దానిపై వారానికి రూ.348 ఖర్చు పెడుతున్నారని సర్వే వివరిస్తోంది.
అయితే, స్మోక్ చేయడంవల్ల తమకున్న తీవ్ర ఒత్తిడి నుంచి బయటపడుతున్నట్లు సర్వేలో పాల్గొన్న వ్యక్తులు అభిప్రాయపడ్డారట. అంతేకాదు, చాలామంది కోల్ కతా వాసులు తమ పని గంటలు పూర్తయిన తర్వాతే స్మోక్ చేస్తున్నారని సర్వే చెప్పింది. అయితే, పొగాకు ఉపయోగంవల్ల వచ్చే జబ్బుల గురించి వారిని అడగ్గా, దీనివల్ల ఊపిరితిత్తులు, నోరు, గొంతు క్యాన్సర్ వస్తుందని తమకు తెలుసునని కూడా చెప్పారట. ముంబయి, కోల్ కతా, అహ్మదాబాద్, లక్నో, హైదరాబాదు నగరాల్లోని పదకొండొందల మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు.