: పదేళ్లకే హైస్కూల్ చదువు పూర్తి... అమెరికా బాలుడి ఘనత
చిన్నారులు చిచ్చర పిడుగులని ఎందుకంటారో అందరికీ తెలుసు. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు తమ తెలివితేటలకు మరింత పదును పెడుతున్నారు. తాజాగా అమెరికాలోని భారత సంతతికి చెందిన తనిష్క్ అబ్రహాం అనే బాలుడు పదేళ్లకే హై స్కూల్ గ్రాడ్యుయేషన్ (12వ తరగతితో సమానం) పూర్తి చేసి రికార్డ్ నెలకొల్పి ఆశ్చర్య పరిచాడు. దీంతో, అమెరికాలో అతిచిన్న వయసులో హైస్కూల్ చదువు పూర్తి చేసిన విద్యార్థిగా ఘనత సాధించాడు.
ఇటీవలే కాలిఫోర్నియా ఆటో మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ధృవీకరణ పత్రం అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన తనిష్క్, మంచి వైద్యుడు కావటమే తన లక్ష్యమని తెలిపాడు. వీలైనంత త్వరగా దానికి సంబంధించిన డిగ్రీని పూర్తి చేయాలన్నది తన కోరికని చెప్పాడు. ఆ తర్వాత తను విశ్వవిద్యాలయానికి వెళతానని వెల్లడించాడు. ఈ చిన్నారిని ప్రశంసిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లేఖ రాశారు.
కాలిఫోర్నియాలోని శాక్రమెంటోకు చెందిన అబ్రహాం పాఠశాలకు వెళ్లిన తొలినాళ్లలోనే చదువులో బాగా ముందుండే వాడు. తర్వాత రెండు, మూడు తరగతుల పాఠ్య పుస్తకాలను అవలీలగా చదివేశాడు. మిగతావారి కంటే ముందుగా అన్ని విషయాలను చెప్పేవాడు. దీన్ని గుర్తించిన అతడి తల్లిదండ్రులు పాఠశాలకు పంపకుండా ఇంటికే టీచర్లను పిలిపించి చదువు చెప్పించారు. అలా ఇంటి వద్దే ఏడేళ్ల వయసు నుంచి చదువుకుని మంచి మార్కులతో హైస్కూలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.