: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అర్హత లేదు?
కేంద్ర ప్రణాళికా సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర హోదా ఆశలపై నీళ్లు చల్లింది. కేంద్రం నుంచి ప్రత్యేక హోదా పేరిట అదనపు సాయం పొందే అర్హత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదని ప్రణాళికా సంఘం తెలిపింది. జాతీయ అభివృద్ధి మండలి నిర్ధేశించిన సూత్రాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పొందలేదని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ రావుకు ప్రణాళికా సంఘం అధికారులు తెలిపారు. కాగా, ప్రత్యేక హోదా కోసం బీహార్, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
బీహార్ కు ఆ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని, మిగిలిన మూడు రాష్ట్రాలకు ఆ హోదా వర్తింపజేయవచ్చని ప్రణాళికా సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రానికి గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ప్రకారం 90 శాతం నిధులను గ్రాంట్ గా, 10 శాతం నిధులను అప్పుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రస్తుతానికి ఈ హోదాపై అరుణాచల్ ప్రదేశ్, అసోం, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు నిధులు పొందుతున్నాయి.
జాతీయ అభివృద్ధి మండలి నిబంధనల ప్రకారం కొండలు, దుర్గమ ప్రాంతాలు అధికంగా ఉండడం, జనసాంద్రత తక్కువగా ఉండి, పెద్ద సంఖ్యలో గిరిజనులు నివసిస్తుండడం, వ్యూహాత్మక సరిహద్దు రాష్ట్రమై ఉండడం వంటి లక్షణాలు ఉంటే దానికి ప్రత్యేక హోదా వర్తిస్తుంది.