: నా ఒంట్లో ఉన్నది నందమూరి రక్తమే.. తాత పెట్టిన పార్టీకే మద్దతు: జూ. ఎన్టీఆర్
ఫ్లెక్సీల వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి నోరు విప్పారు. తనకు సంబంధం లేని వ్యవహారాల్లోకి తనను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. జూ. ఎన్టీఆర్ నేడు హైదరాబాద్ లో జరిగిన 'బాద్ షా' విజయోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుతం బాద్ షా సక్సెస్ పట్ల ఆనందిస్తున్నానని, అనవసరమైన విషయాల్లోకి లాగి సంతోషాన్ని హరించవద్దని సూచించారు. ''నా ఒంట్లో ప్రవహించేది నందమూరి రక్తమే. మా తాత ఎన్టీఆర్ ఆశీర్వాదం వల్లే నేనీస్థాయికి వచ్చాను. ఆయన పెట్టిన పార్టీకే ఎల్లప్పుడు నా మద్దతు ఉంటుంది'' అని ఎన్టీఆర్ చెప్పాడు.
అంతకుముందు బాద్ షా సినిమా గురించి మాట్లాడుతూ, చిత్రం సక్సెస్ కావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పాడు. ఈ చిత్రంలో తన శక్తి మొత్తం ధారపోసి నటించానని పేర్కొన్నాడు. కుటుంబంతో కలిసి సినిమా చూసిన సమయంలో కొన్ని పాటల్లో తన డ్యాన్సులు చూసి తానే మైమరిచి పోయినట్టు వివరించాడు.
ఇక సినిమా టెక్నీషియన్లపై జూ.ఎన్టీఆర్ ప్రశంసల జల్లు కురిపించాడు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, మాటల రచయిత గోపీ మోహన్, కమెడియన్లు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణల గురించి మాట్లాడాడు. కాగా, చిన్న పాత్రే అయినా సినిమాను మలుపు తిప్పే పాత్ర పోషించిన సిద్ధార్థ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తన సినిమాలకు అమెరికాలోనూ ఇంత రెవిన్యూ రావడం ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ కార్యక్రమానికి దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత బండ్ల గణేశ్, కథానాయిక కాజల్ తదితరులు హాజరయ్యారు.