: ప్రేమన్నాడు...పెళ్లి చేసుకున్నాడు...బండరాయితో మోదాడు
ప్రేమించానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు కానీ తెలియలేదు. అతను ప్రేమించింది అమ్మాయిని కాదు, అమ్మాయి వేసుకున్న నగలనని! అది తెలుసుకునేసరికే జరగాల్సింది జరిగిపోయింది. ఆమెపై లైంగిక దాడి చేసి, పెద్ద బండరాయితో ఆమెను మోది చనిపోయిందనుకుని ఆమె ఒంటిపై వున్న నగలు తీసుకుని అతను ఉడాయించాడు. నెమ్మదిగా స్పృహలో కొచ్చిన బాధితురాలు స్థానికుల సాయంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది.
ఆమె పోలీసులకు వెల్లడించిన వివరాల ప్రకారం... తమిళనాడు రాష్ట్రం పల్లికొండ సమీపంలోని కీల్‌చేర్ గ్రామానికి చెందిన ఆమె(23) ఓ షూ కంపెనీలో పని చేస్తోంది. అంబూరు సమీపంలోని మేల్‌వయిదన కుప్పానికి చెందిన టైలర్ పెరియ మురుగతో రెండేళ్ల క్రితం ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. దీంతో ఆమె పెళ్లి కోసం నగలను సిద్ధం చేసుకుంది. వాటిపై కన్నేశాడు మురుగ.
ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేశాడు. దీంతో అతను తనను బలంగా ప్రేమిస్తున్నాడని నమ్మిన ఆమె గురువారం ఉదయం అన్నీ సర్దుకుని ఇంటి నుంచి వచ్చేసింది. ఆమెను తీసుకుని మురుగ కాణిపాకం వచ్చాడు. అక్కడ ఉదయం 10.30 గంటలకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి తమిళనాడు వెళ్తూ, మార్గ మధ్యంలో పలమనేరు మండలంలోని కాలువపల్లె కౌండిన్యా అటవీప్రాంతం చాలా బాగుంటుందని చెప్పి అడవిలోకి తీసుకెళ్లాడు.
అక్కడ అతనిలోని అసలు మనిషి మేల్కొన్నాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాడు. అంతే అక్కడ ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత బలవంతంగా ఆమె మెడలోని నెక్లెస్, మూడు చైన్లు, ఓ హారం లాక్కున్నాడు. వాటితో పాటు ఆ ఉదయం తాను కట్టిన తాళిని సైతం తీసేసుకున్నాడు. నగలు తీసుకుంటున్నప్పుడు భర్తే కదా అని ఊరుకున్న బాధితురాలు, తాళి లాక్కుంటుండడంతో ఇక ప్రతిఘటించింది.
అంతే ఆమెపై ఓ పెద్ద బండ రాయిని వేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయింది. ఆమె చనిపోయిందని భావించిన మురుగ నగలతో సహా బైక్ పై ఉడాయించాడు. కొంతసేపటికి స్పృహలో కొచ్చిన బాధితురాలు అతి కష్టంపై అక్కడి నుంచి మెయిన్ రోడ్డుకు చేరుకుంది. ఆమెను గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారమందించారు. దీంతో వారు ఆమెను పలమనేరు ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పలమనేరు పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.