: పోలవరంపై అప్పుడెందుకు నోరు మెదపలేదు?: రేవంత్ రెడ్డి
పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో చెప్పినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు నోరెత్తలేదని టీడీపీ నేత రేవంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ శాసన సభలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పూర్తి వివరాలు పొందుపరిచారని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అమలు కావడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయలేదని, అదే పనిని ఎన్డీయే ప్రభుత్వం చేసిందని ఆయన తెలిపారు.
దీనిని రాజ్యసభలోనే టీఆర్ఎస్ వ్యతిరేకించి ఉంటే సరిపోయేదని, అప్పుడు చర్చించడం మానేసి, ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఒక పార్టీని లక్ష్యం చేసుకుని శాసనసభను నడపడం సరికాదని ఆయన హితవు పలికారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం మానాలని టీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి సూచించారు.