: స్కామ్ ఇండియాను స్కిల్ ఇండియాగా తీర్చిదిద్దుతాం: ప్రధాని
స్కాం (కుంభకోణాల) దేశంగా పేరొందిన భారతదేశాన్ని స్కిల్ ఇండియాగా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభలో కోరారు. అదే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని, ఉపగ్రహ ప్రసారాల ద్వారా విద్యా బోధన అందించాలనీ అన్నారు. గ్రామాలకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తే అవే అభివృద్ధి కారకాలు అవుతాయని చెప్పారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించాలన్న మోడీ, చిన్న రాష్ట్రం సిక్కిం త్వరలోనే సేంద్రీయ సాగు రాష్ట్రంగా అవతరిస్తుందని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని, ఈశాన్య రాష్ట్రాలు కూడా త్వరలోనే పూర్తి సేంద్రీయ సాగు విధానంలోకి మారతాయన్నారు. ఇక మహిళల మాన, మర్యాదలతో మనం ఆటలాడకూడదన్న ప్రధాని... అత్యాచారాల గురించి మంత్రులు ఎక్కువగా సొంత విశ్లేషణలు చేయరాదని కోరుతున్నాన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యతని పేర్కొన్నారు.