: ఈ మహిళా ట్రాఫిక్ పోలీస్ అంటే రాజకీయ నాయకులకు మంట
నిత్యం కాలుష్యం, వాహనాల రణగొణ ధ్వనుల మధ్య 20ఏళ్లుగా ట్రాఫిక్ పోలీస్ సేవలు అందించడం మామూలు విషయం కాదు. అదీ స్వచ్చందంగా కేవలం నామమాత్ర జీతానికి! ఎంతో ఇష్టపడి 20ఏళ్లుగా ట్రాఫిక్ వార్డెన్ గా ముంబైలో విధులు నిర్వర్తిస్తోంది అమితాలోబో. కానీ, ఆ చిన్నపాటి ఉద్యోగానికీ రాజకీయ నాయకులు చిచ్చుపెట్టారు.
బాంద్రాఖర్ ప్రాంతంలో అమిత ట్రాఫిక్ వార్డెన్ గా సేవలు అందిస్తోంది. ఈమె అంటే అక్కడి ప్రముఖులకు కడుపు మంట. ఎందుకంటే సామాన్యులకు ఏ మాత్రం అసౌకర్యం కలిగినా ఒప్పుకోదు. వీఐపీలైనా, సామాన్యులైనా ఆమె దృష్టిలో ఒక్కటే. అందరిలా మీ దారిన మీరు వెళ్లండంటుంది. గత జనవరి 28న మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి నారాయణ రానే కొడుకు, పార్లమెంట్ సభ్యుడైన నీలేష్ రానే ఖర్ ప్రాంతంలో భారీ కాన్వాయ్ తో వెళుతుండగా అమిత అడ్డుకున్నారు. ట్రాఫిక్ కు అవరోధం కలిగించకుండా సహకరించమన్నారు. అమిత, నీలేష్ మధ్య వాదన జరిగింది. ఆమెపై ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు అమితను ట్రాఫిక్ విధుల నుంచి తప్పిస్తూ నోటీసులు జారీ చేశారు.
రాజకీయ ఒత్తిడితో అమితను తప్పించిన ఉన్నతాధికారులకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఖర్ ప్రాంత వాసులు పోలీస్ కమిషనర్ ను కలిసి అమితను మళ్లీ విధులలోకి తీసుకోవాలని, ఆమె ఉత్తమ ఉద్యోగి అని.. తప్పకుండా తమ ప్రాంతంలో ఆమె ఉండి తీరాలని కోరారు. దీంతో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక అధికారులు అయోమయంలో పడ్డారు. కానీ, ఉన్నతాధికారులు 20ఏళ్లుగా స్వచ్చంద సేవలు అందిస్తున్న తనను అర్దంతరంగా తీసివేయడం పట్ల అమిత ఆవేదన వ్యక్తం చేశారు.