: 15 మంది కేంద్ర మంత్రులు, 10 మంది సీఎంలు వస్తున్నారు: డీజీపీ


ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామని డీజీపీ జేవీ రాముడు తెలిపారు. గుంటూరులోని సభా వేదిక వద్ద ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి 15 మంది కేంద్ర మంత్రులు, 10 మంది ముఖ్యమంత్రులు వస్తున్నారని అన్నారు. వీఐపీ పార్కింగ్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించామని ఆయన చెప్పారు. అలాగే జనరల్ వాహనాల కోసం కూడా మార్గదర్శకాలు జారీ చేశామని, డైవర్షన్స్ నిర్ధారించామని ఆయన వివరించారు.

వీఐపీలైనా, కార్యకర్తలైనా రోడ్డు మార్గం ద్వారా మాత్రమే వచ్చే వెసులుబాటు ఉండడంతో హెలీకాప్టర్లను అనుమతించలేదని ఆయన స్పష్టం చేశారు. రోడ్డును రెండు భాగాలు చేశామని తెలిపిన ఆయన, రోడ్డు ఎడమ వైపు వీఐపీలకు కేటాయించామని చెప్పారు. అలాగే కుడివైపు రోడ్డు మొత్తం పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోసమని ఆయన స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్న సందర్భంగా మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని డీజీపీ తెలిపారు.

ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పది వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రమాణ స్వీకారానికి వచ్చేవారంతా సాయంత్రం మూడు గంటల్లోపే రావాలని ఆయన సూచించారు. మూడు దాటిన తరువాత వస్తే ప్రమాణ స్వీకారం తిలకించే అవకాశం కోల్పోతారని ఆయన స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా వచ్చే పార్టీ కార్యకర్తలు, అభిమానులకు మంచినీరు, మజ్జిగ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News