: మరణం అంచుల్లో ప్రకాశమైన వెలుగు
మరణించిన తర్వాత ఎక్కడకు వెళ్తాం? ఈ ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేరు? ఎందుకంటే 'మరణించిన తర్వాత' గురించి మనకు సమాచారం ఇచ్చేవాళ్లుండరు కాబట్టి. కానీ, మరణం అంచుల వరకు వెళ్లి వచ్చిన వారు మనకు బోలెడు మంది ఉంటారు. మరి ఆ మరణం అంచుల్లో ఏం ఉంటుందో వారు చూసి ఉండే చాన్సుంటుంది కదా! అందుకని అలాంటి పరిస్థితుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని ఇంటర్వ్యూచేసి.. కొత్త వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు కొందరు న్యూరో సైకాలజిస్టులు.
కోమా అంటే మనం దాదాపుగా చావు కిందే భావిస్తాం. అందుకే కోమాలోంచి బయటపడిన కొందరితో ఈ అధ్యయనం సాగించారు. వారి అనుభవాలు తెలుసుకోగలిగేలా ప్రశ్నావళి రూపొందించారు. కొందరు తమకేమీ గుర్తులేదన్నప్పటికీ.. వీరిలో ఎక్కువ మంది కుల మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా ఒకే రకమైన సమాధానాలు చెప్పారని తేలింది. మృత్యుముఖంలోకి వెళ్లినప్పుడు .. ఓ నల్లటి సొరంగ మార్గం తర్వాత.. తమకు ప్రకాశవంతమైన వెలుగు కనిపించినట్లు వారు చెప్పార్ట. న్యూరో సైకాలజీ శాస్త్రవేత్త వెఎస్సా చార్లెండ్ వెర్విలే ఈ వివరాల్ని వెల్లడించారు.