: జయప్రద.. అసలు విషయం చెప్పమ్మా..!


అదిగో వస్తా.. ఇదిగో వస్తా.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మళ్లీ పూర్వ వైభవం సొంతం చేసుకోవాలని ఆశ పడుతున్న జయప్రద చెబుతున్న డైలాగులు ఇవి. గత మూడు నెలలుగా వేసిన రికార్డునే జయప్రద మళ్లీ మళ్లీ వేస్తున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి వస్తానని.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని నెల క్రితం ఆమె ప్రకటించారు. అంతకుముందు, ఆ తర్వాత కూడా పలు సార్లు రాష్ట్ర రాజకీయాలలోకి వస్తున్నా.. వస్తున్నా అన్నారు. అసలింతకీ జయప్రద ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారు..? అనే సందేహం ప్రజలలోనే కాదు రాజకీయ వర్గాలలోనూ నెలకొంది.

గతంలో టీడీపీలో కీలక పాత్ర పోషించిన జయప్రద అటుపై తన మకాం ఉత్తరప్రదేశ్ కు మార్చారు. సమాజ్ వాదీ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. అమర్ సింగ్ ను సమాజ్ వాదీ పార్టీ సస్పెండ్ చేయడంతో జయప్రద కూడా బయటకు వచ్చేశారు. తర్వాత ఆమె చూపు రాష్ట్రం వైపు మళ్లింది. కానీ, ఏ పార్టీలో చేరాలో ఆమెకే అయోమయంగా ఉందట. టీడీపీనా? వైఎస్సార్ కాంగ్రెసా? అనే లెక్కల్లో పడిపోయారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇకనైనా రాష్ట్ర రాజకీయాలలోకి వస్తానని మరోసారి చెప్పకుండా ఏ పార్టీలో చేరతారో చెబితే వినాలని అనుకుంటున్న వారి ఆశలను జయప్రద తీరుస్తారేమో చూడాలి!

  • Loading...

More Telugu News