: రాజకీయ కోవిదుడు ముండే జీవిత విశేషాలు...


దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన రాజకీయ కోవిదుడు గోపీనాథ్ ముండే. అత్యంత ప్రతిభావంతమైన నాయకులలో ఒకరిగా ముండే ఖ్యాతి గడించారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత స్థాయికి ఎదిగిన బీజేపీ సీనియర్ నేత ముండే. ముండే అసలు పేరు గోపీనాథ్ పాండురంగ్ ముండే. 1949 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని పరాలీలో వంజరి కులానికి చెందిన వ్యవసాయదారుల కుటుంబంలో ముండే జన్మించారు. ఐదుసార్లు మహారాష్ట్ర అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యారు. 1992-1995 కాలంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా ముండే వ్యవహరించారు. 1995-1999 మధ్య కాలంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009, 2014 లో లోక్ సభకు ఎన్నికయ్యారు. లోక్ సభలో బీజేపీ డిప్యూటీ లీడర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం మోడీ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలను ఆయన నిర్వర్తిస్తున్నారు.

బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన దివంగత ప్రమోద్ మహాజన్ సోదరి అయిన ప్రద్న్యని ముండే వివాహమాడారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు (పంకజ, ప్రీతం, యషశ్రీ) ఉన్నారు. వీరిలో పంకజ ఎమ్మెల్యే కాగా, ప్రీతం డాక్టరుగా పనిచేస్తున్నారు. యషశ్రీ న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు.

తన స్నేహితుడు, కాలేజ్ లో సహ విద్యార్థి అయిన ప్రమోద్ మహాజన్ ప్రోద్బలంతోనే ముండే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ రోజు ఉదయం 6.30 గంటలకు దక్షిణ ఢిల్లీలోని మోతీ బాగ్ ప్రాంతలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురయింది. ప్రమాదస్థలి ఢిల్లీ విమానాశ్రయానికి దగ్గర్లో ఉంది. ఈ ప్రమాదంలో ముండే తల, ఛాతీ, వెన్నుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలిలో ముండేకు తీవ్ర రక్త స్రావం అయింది. తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆయన స్వయంగా తన గార్డులకు సూచించారు. గాయపడిన ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. డయాబెటిక్ పేషంట్ అయిన ముండేకు చికిత్స సమయంలో గుండె సంబంధిత ఇబ్బందులు కూడా తలెత్తడంతో... ఆయన మృతి చెందారు.

  • Loading...

More Telugu News