: షిర్డీలో బావి నుంచి లక్షల విలువైన నాణాల వెలికితీత
మహారాష్ట్రలో కొలువై ఉన్న షిర్డీ సాయినాథుని ఆలయం వద్ద ఓ పాడుబడ్డ బావి నుంచి నేడు లక్షల విలువ చేసే నాణాలను వెలికితీశారు. వీటి విలువ రూ. 1.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కాగా, నాణాలతో పాటు ఇతర వస్తువులూ ఈ బావి నుంచి బయటపడ్డాయి. లెండి బాగ్ ప్రాంతంలో ఉన్న ఈ బావిని శుభ్రం చేస్తుండగా ఇవన్నీ వెలుగుచూశాయి. వందేళ్ళ క్రితం బాబా జీవించి ఉన్న రోజుల్లో ఈ బావి నుంచే నీటిని తోడుకుని స్వీకరించేవారట. భక్తులు సాయిని దర్శించుకున్న పిదప ఈ బావిలో నాణాలు విసరడం ఆనవాయతీ అని షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కరవు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో బావిలో పూడిక తీసి నీటిని వినియోగించుకోవాలన్న ప్రయత్నంలో ఈ నాణాలు బయటపడ్డాయని తెలుస్తోంది.