: ప్రస్తుత బీజేపీ నా భావాలకు సరిపోయే విధంగా లేదు: ఎల్ కే అద్వానీ
ప్రస్తుత బీజేపీ తన భావాలకు సరిపోయే విధంగా లేదని బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ అభిప్రాయపడ్డారు. పార్టీలో పదవులకోసం పాకులాడకుండా సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని ఉద్భోదించారు. అవినీతికి తావులేకుండా క్రమశిక్షణతో ముందుండి పార్టీని తీసుకుపోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, అయోధ్య ఉద్యమంలో పార్టీ పాత్రపై చింతించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలపైనే కట్టుబడి ఉండాలని సూచించారు.
న్యూఢిల్లీలో జరిగిన పార్టీ 33వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన అద్వానీ తన మనసులోని భావాలను బయటపెట్టారు. అయితే 2014 లోక్ సభ ఎన్నికల్లో అద్వానీ నాయకత్వంలోనే బీజేపీ పోరాడుతుందని పార్టీ నేత విజయ్ గోయెల్ స్పష్టం చేశారు. పార్టీని అటల్ బిహారీ వాజ్ పాయ్, అద్వానీ బలోపేతం చేశారన్నారు. ప్రస్తుతం వాజ్ పాయ్ అనారోగ్యంతో ఉన్నారన్న గోయెల్... అద్వానీ ఉపదేశంతోనే బీజేపీ 2014లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.