: రక్షణ రంగంలో విదేశీ ఆధిపత్యానికి బాటలు!
రక్షణ ఉత్పత్తుల రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు వీలు కల్పించే దిశగా మోడీ సర్కారు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రక్షణ రంగానికి సంబంధించి ఎఫ్ఐఐ పెట్టుబడుల పరిమితి 25 శాతంగానే ఉంది. యూపీఏ సర్కారు 100 శాతానికి ద్వారాలు తెరుద్దామని చూసినా, నాటి రక్షణ మంత్రి ఆంటోనీ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వం మారిపోవడంతో ఆ ద్వారాలు కాస్తా పూర్తిగా తెరచుకోవడానికి సమయం ఆసన్నమైనట్లుంది.
రక్షణ రంగంలో 100 శాతం పెట్టుబడులను ఆమోదనీయ విధానం (అంటే ఏ పెట్టుబడి ప్రతిపాదనైనా కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది)లో అనుమతించేందుకు వీలుగా ఓ కేబినెట్ నోట్ ను వాణిజ్య శాఖ వివిధ మంత్రిత్వశాఖలకు పంపింది. అక్కడి నుంచి అభిప్రాయాలు వచ్చాక కేంద్ర కేబినెట్ సమావేశం ముందుకు వెళుతుంది. అక్కడ ఆమోదం లభిస్తే ద్వారాలు పూర్తిగా తెరచుకున్నట్లే. ఈ నిర్ణయం వల్ల దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ రంగం పుంజుకుంటుందని కేంద్రం ఆలోచనగా ఉంది. అదే సమయంలో దేశానికి విదేశీ పెట్టుబడుల రాక కూడా పెరుగుతుంది. కానీ, దేశ భద్రతకు ప్రమాదం అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.