: అప్పుడు సంబరాలు... ఇప్పుడేమో బందా?: వెంకయ్య నాయుడు
'పార్లమెంటు సాక్షిగా తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు అందరూ సంబరాలు చేసుకున్నారు. మరి, అదే బిల్లులో పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని స్పష్టంగా పేర్కొన్నారు, గుర్తు లేదా?' అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, శషభిషలకు అవకాశం లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ, అప్పటి పార్లమెంటులో ప్రధాని చేసిన నిర్ణయాన్ని ఆర్డినెన్స్ రూపంలో జారీ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం జారీ చేసిన ఆర్డినెన్స్ కారణంగా ఖమ్మం జిల్లా సహా, ఇతర తెలంగాణ జిల్లాలకు వచ్చిన నష్టమేమిటో తనకు అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో హైదరాబాద్ ను ఎందుకు వదులుకోవాలని అడిగిన ఆంధ్రప్రదేశ్ నేతలకు, ప్రజలకు... 'అది సరికాదని' సర్ది చెప్పానని వెంకయ్య అన్నారు.
అలాగే భద్రాచలం మీద వివాదం వద్దని తెలంగాణకు దానిని వదిలేద్దామని చెప్పానని అప్పుడు వారు బంద్ లు చేయలేదని, ఇప్పుడు వివాదాలు, రాద్ధాంతాలు ఎందుకు? అని ఆయన నిలదీశారు. పెద్ద లక్ష్యం సాధించాలన్నప్పుడు కొన్ని త్యాగాలు కూడా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. 9 సంవత్సరాల 9 నెలలు తాత్సారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన యూపీఏ ప్రభుత్వం ఆనాలోచిత నిర్ణయాలు తీసుకుందని ఆయన మండిపడ్డారు.
యాపీఏ నాటి జఠిల సమస్యలకు తాము పరిష్కారాలు చూపుతున్నామని ఆయన వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అలాగే రాజ్యసభ సభ్యుల వివాదం కూడా జఠిలంగా మారిందని, దానిని పరిష్కరించేందుకు కేంద్ర హోం శాఖ, న్యాయశాఖ సలహాలను తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా విశాఖ పట్టణానికి తాగునీటి సమస్య, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలకు సాగునీటి సమస్య తీర్చనున్నామని, కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి అక్కడి నీటి సమస్యను పరిష్కరిస్తామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి వివాదాలు లేవని ఆయన వెల్లడించారు.