: జూ. ఎన్టీఆర్ కు బాలకృష్ణ హెచ్చరిక
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీల వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ, అటు నందమూరి అభిమానుల్లోనూ కలకలం రేపుతోంది. కొంచెం సేపటి క్రితం ప్రముఖ సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ కృష్ణాజిల్లా కొమరవోలులో చేసిన వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు, ప్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు ఉండటంపై జూనియరే స్పందించాలని బాలయ్య పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పేవరకూ చెబుతామని.. ఆయన ఏం చెబుతారో చూద్దామని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బాలయ్య తెలిపారు.
బాలకృష్ణ తాజా వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ కు, బాలకృష్ణకు పొసగడం లేదంటూ ఇంతకాలం మీడియాలో వస్తోన్న వార్తలకు ఆజ్యం పోసినట్లైంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న నందమూరి కుటుంబ వ్యవహారం బాలయ్య తాజా ప్రకటనతో భగభగ మండే పరిస్థితికి వచ్చింది. జూనియర్ తండ్రి హరికృష్ణ సైతం బాబు-బాలయ్య వ్యవహారశైలిపై కొంతకాలంగా కినుక వహిస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ప్లెక్సీల వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ జూనియర్ కు బాలయ్య హెచ్చరికలాంటి సందేశం ఇచ్చిన నేపథ్యంలో జూ. ఎన్టీఆర్ స్పందన కోసం..బాబాయ్ ..అబ్బాయ్ పోరు ఏ మలుపు తీసుకుంటుంది అనే అంశం మీదా.. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా, అర్హత, వయసుతో సంబంధం లేకుండా పార్టీలో కష్టపడేవారిని టీడీపీ గౌరవిస్తుందని బాలయ్య కృష్ణాజిల్లా కొమరవోలులో తెలిపారు. త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానన్నారు. పార్టీ టెక్కెట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోనని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని పునరుద్ఘాటించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటామని బాలయ్య భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉండీ కూడా, మండువేసవిలో టీడీపీ ప్రభుత్వం విద్యుత్ సరఫరా నిరాటంకంగా చేయగలిగిందన్నారు. ఇప్పుడు 'అధికారంలో కాంగ్రెస్.. అంధకారంలో రాష్ట్రం' అన్న రీతిన రాష్ట్రం మారిపోయిందని బాలయ్య ఎద్దేవా చేశారు.