: ఒకే ఒక్క బంతి తారే ను తారాపథంలోకి తీసుకెళ్లింది
క్రికెట్ లో ఒక్కోసారి కేవలం ఒక్క బంతి ఆటగాడి తలరాతను మార్చేస్తుంది. ఐపీఎల్ 7 లో నిన్న జరిగిన మ్యాచ్ లో కేవలం ఒకే ఒక్క బంతి ముంబై ఇండియన్స్ ఆటగాడు ఆదిత్యతారేను స్టార్ ను చేసేసింది. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో ఒక్కబంతిలో నాలుగు లేక ఆరు పరుగులు చేయాలి. అప్పటి వరకు ధాటిగా ఆడుతున్న అంబటి తిరుపతి రాయుడు పది బంతుల్లో 30 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.
దీంతో క్రీజులోకి ఆదిత్య తారే వచ్చాడు. ముంబై డగౌట్ లో అంతా నిశ్శబ్ధం. రాజస్థాన్ రాయల్స్ డగౌట్ లో ప్లేఆఫ్ కు చేరిపోయామన్న భరోసాతో అప్పటికే సంబరాలు చేసుకున్న ఆనందం కనబడుతున్నా నిశ్శబ్ధం. ఇంతలో తారే కాలు (లెగ్ స్టంప్) లక్ష్యంగా ఫాల్క్ నర్ బంతిని సంధించాడు. తారే బంతిని బలంగా మిడ్ ఆన్ మీదుగా బాదాడు. అలా గాల్లో తేలిన బంతి బౌండరీదాటి ఫీల్డర్లను ముద్దాడింది. అంతే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది.
ముంబై ఇండియన్స్ డగౌట్ మొత్తం సంభ్రమాశ్చర్యాలతో పట్టలేని ఆనందంతో ఆటగాళ్లదగ్గరకు పరుగెత్తారు. బంతిని బాదిన తారే తాను గెలిపించానోచ్ అంటూ పరుగులు పెట్టాడు. హర్షాతిరేకాన్ని తట్టుకోలేక తన టీషర్టును ముఖం మీదకు లాక్కుని స్టేడియంలో పరుగులు తీస్తూ సహచరుల అభినందనల్ని అందుకున్నాడు. సచిన్, కుంబ్లే వంటి దిగ్గజాలు తారేను కౌగిలించుకుని అభినందించారు. డగౌట్ లో కూర్చున్న రాజస్థాన్ ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు. స్పందనను కన్పించనివ్వని రాహుల్ ద్రావిడ్ క్యాప్ విసిరేసి అసహనాన్ని ప్రదర్శించాడు. ఒక్క బంతి తారేను తారాపథంలోకి తీసుకెళ్లింది.