: విశాఖ తాజ్ మహల్ దుస్థితి ఇదీ!


తన ప్రేమకు ప్రతిరూపంగా తాజ్ మహల్ ను నిర్మించి షాజహాన్ చరితార్థుడయ్యాడు. ఆ మొగల్ చక్రవర్తి స్ఫూర్తిగా చాలా మంది ప్రేమపిపాసులు తమ ప్రేమ గుర్తుగా నిర్మాణాలు చేపట్టినప్పటికీ అవి అంతగా ప్రాచుర్యం పొందలేదు. విశాఖ పట్టణంలో కూడా ఓ ప్రేమ మందిరం ఉంది. వాల్తేరు బస్ డిపోకు దగ్గర్లోని బీచ్ రోడ్ లో రెడ్ హిల్స్ జంక్షన్ పక్కన నిటారుగా ఉండే అపార్ట్ మెంట్స్ మధ్యలో ఠీవిగా అందర్నీ ఆకట్టుకునే నిర్మాణం ఒకటి ఉంది. అదే వైజాగ్ తాజ్ మహల్!

ఈ నిర్మాణానికి ఓ ప్రేమ కథ ఉంది. దాదాపు 125 ఏళ్ల క్రితం విశాఖపట్టణాన్ని దసపల్లి, కురుపాం రాజులు పాలించే వారు. వీరి పేరుమీదే దసపల్లా హిల్స్, కురుపాం మార్కెట్ వెలిశాయి. కాగా, అప్పట్లో కురుపాం మహారాణి వైరిచర్ల అప్పలనరసాయమ్మ ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మంచం పట్టిన మహారాజు ఆమె జ్ఞాపకాలతో విశాఖ తీరంలో భారతీయ భవన నిర్మాణ నాణ్యత, నైపుణ్యం ఉట్టిపడేలా, భగవద్గీత శ్లోకాలు రాయించి చూడచక్కని కట్టడాన్ని నిర్మించారు.

అది వైజాగ్ తాజ్ మహల్ గా ప్రసిద్ధమైంది. దానికి ఈ ఏడాదికి 111 సంవత్సరాలు పూర్తవుతాయి. కమలహాసన్, సారిక నటించిన 'మరో చరిత్ర' సినిమాలో ఈ నిర్మాణం కనబడింది. ఇప్పుడీ నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంటోంది. దీనిని పట్టించుకునే నాథుడు లేడు. హైదరాబాదులో పురాతన కట్టడాల సంరక్షణకు పలు సంస్థలు పని చేస్తున్నాయి. విశాఖలో వీటి జాడ కనిపించదు. కురుపాం మహారాజుల వారసులు ఈ కట్టడానికి రెండు వైపులా భారీ అపార్టుమెంట్లు నిర్మించారు.

దీనిని కూలదోసి మరో అపార్టుమెంటుకు రూపకల్పన చేయగా, విశాఖలోని కొందరు ప్రేమికులు స్వచ్ఛందంగా వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. వారి కృషి ఫలితంగా భారత ప్రభుత్వం ఈ కట్టడాన్ని సంస్కృతి, సంప్రదాయాల జ్ఞాపక చిహ్నంగా ప్రకటించింది. ఇప్పుడు దీనిని పట్టించుకునే వారు లేరు. తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఈ భవనం చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలు పెరిగిపోయాయి. దీని చుట్టూ ఉన్న ప్రదేశంలో భారీ భవనాలు మొలకెత్తాయి. ఇది మాత్రం గత వైభవాన్ని తలచుకుంటూ ఠీవిగా నిలుచుంది. దీనిని సంరక్షించాలని విశాఖపట్నంలోని ప్రేమికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News