: మోడీ మంత్రివర్గం ఇదే... వెంకయ్యకు రైల్వే శాఖ?


నరేంద్రమోడీ తన మంత్రివర్గానికి ప్రాథమికంగా ఒక రూపునిచ్చారు. రాష్ట్రానికి చెందిన ముఖ్యనేత వెంకయ్యనాయుడికి రైల్వే శాఖ కేటాయించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన మరో ఎంపీ బండారు దత్తాత్రేయకు సామాజిక న్యాయ శాఖ దక్కనుందని సమాచారం. మోడీ మంత్రి వర్గానికి సంబంధించి ఢిల్లీలో మీడియాకు కొంత సమాచారం లభించింది. దీన్ని బట్టి చూస్తే...

హోంశాఖ బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను వరించనుంది. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా కీలకమైన ఆర్థిక శాఖకు సుబ్రహ్మణ్యస్వామిని మోడీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీన్ని అరుణ్ జైట్లీకి కేటాయిస్తారని భావించారు. అయితే, ఆయనకు విదేశీ వ్యవహారాల శాఖ కేటాయించనున్నారు. మరో కీలకమైన రక్షణ శాఖకు సుష్మాస్వరాజ్ ను ఎంపిక చేశారు. అద్వానీ ఎన్డీయే చైర్మన్ గా వ్యవహరించనున్నారు.

అనంతకుమార్ కు టెలికాం, గోపీనాథ్ ముండేకు వ్యవసాయం, రామ్ విలాస్ పాశ్వాన్ కు పెట్రోలియం శాఖ, ఎస్ఎస్ అహ్లూవాలియాకు వాణిజ్యశాఖ, నితిన్ గడ్కరీకి పట్టణాభివృద్ధి శాఖ కేటాయిచనున్నారు. రవిశంకర్ ప్రసాద్ కు న్యాయశాఖ, పౌరవిమానయాన శాఖ షానవాజ్ హుస్సేన్ కు లభించింది. మైనారిటీ శాఖను ముక్తార్ అబ్బాస్ నఖ్వికి కేటాయించనున్నారు.

ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున సీఎం అభ్యర్థిగా నిలిచిన హర్షవర్ధన్ కు ఆరోగ్య శాఖ లభించనుంది. హన్స్ రాజ్ అహిర్ కు బొగ్గు శాఖ, భారీ పరిశ్రమల శాఖ ఆనంద్ రావు హడ్సుల్ కు లభించనున్నాయి. ఇక, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు మానవ వనరుల అభివృద్ధి, కీర్తి ఆజాద్ కు క్రీడాశాఖ, జగదాంబికా పాల్ కు సమాచార శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు అనురాగ్ ఠాకూర్ కు కేటాయించనున్నారు.

శ్రీపాద నాయక్ కు పర్యాటక శాఖ, మీనాక్షి లేఖినికి సాంస్కతిక శాఖ, ఖండూరీకి సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ ఇవ్వనున్నారు. మాజీ సైన్యాధ్యక్షుడు వీకే సింగ్ కు రక్షణ శాఖ సహాయ మంత్రి, మాజీ షూటర్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కు క్రీడాశాఖ సహాయ మంత్రి, సత్యపాల్ సింగ్ కు హోంశాఖ సహాయ మంత్రి, రాజుశెట్టికి వ్యవసాయ శాఖ సహాయ మంత్రి దక్కనుంది.

  • Loading...

More Telugu News