: కారు కొంటామని చెప్పి... రూ. 3.77 కోట్లు నొక్కేశారు!
ఫోర్జరీ పత్రాలతో 3.7 కోట్ల రూపాయల మేర బ్యాంకునే బురిడీ కొట్టించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఈ కేసులో ఆటోమొబైల్ డీలర్ సహా మొత్తం 39 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చీఫ్ మేనేజర్ ఎన్.ఎ.దుసానె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు.
2013 సెప్టెంబరు నాటికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డోంబివిలి శాఖలో వాహన రుణాల బకాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అధికారులు పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. 2012లో సునీల్ మదాల్కర్ అనే వ్యక్తి కారు కొనుగోలు కోసం బ్యాంకు నుంచి రూ.14 లక్షలు రుణం తీసుకున్నాడు. ఆ మొత్తం నేరుగా మౌళి ఆటోమోటివ్ ఖాతాలోకి వెళ్లిపోయింది. కానీ, రుణం కోసం బ్యాంకుకు సంప్రదించినప్పుడు నకిలీ కొటేషన్లు, పత్రాలను సమర్పించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసినప్పుడు... మౌళి వాహనం ఆర్టీవోలో రిజిస్టర్ కాలేదని తెలిసింది. ఎందుకంటే, మౌళి అసలు కారే కొనలేదు. అతను ఆటోమోటివ్ యజమాని నితిన్ పి డోంగ్రేతో కలిసి బ్యాంకును బురిడీ కొట్టించాడు.
ఇక, మౌళికి రుణం మంజూరు కావడంతో... అదే పద్ధతిని మరికొంతమంది ఫాలో అయ్యారు. 37 మంది తీసుకున్న రుణం ఏకంగా రూ. 3.77 కోట్లకు చేరింది. దీంతో, వీరందరిపైనా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.