: ఎన్నికల్లో పనిచేయని ‘జై సమైక్యాంధ్ర’ నినాదం


‘జై సమైక్యాంధ్ర‘ నినాదం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. ఫలితంగా జై సమైక్యాంధ్ర పార్టీ సీమాంధ్రలో ఖాతా తెరువలేకపోయింది. జైసపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు సహా, ఎన్నికల ముందు టీడీపీలోకి జంప్ చేసిన మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులు పరాజయం పాలయ్యారు. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రజాదరణ గల నేత ఒక్కరు కూడా కిరణ్ వెంట లేరు. కిరణ్ ప్రాతినిధ్యం వహించిన పీలేరు నియోజకవర్గంలో బరిలోకి దిగిన ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

సీమాంధ్ర ప్రాంతంలో జై సమైక్యాంధ్ర పార్టీ 25 పార్లమెంటు, 152 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. తెలంగాణలో నాలుగు లోక్ సభ, 19 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోటీ చేసిన జైసపా మొత్తం 2,20,762 ఓట్లు (0.4 శాతం) మాత్రమే సంపాదించగలిగింది. సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన గంటా, పితాని, శైలజానాథ్ కిరణ్ కు దూరమయ్యారు. ఇక ఎంపీల్లో సాయిప్రతాప్, లగడపాటి, ఉండవల్లి, రాయపాటి కిరణ్ కు దూరమయ్యారు. వీరిలో లగడపాటి ఎన్నికలకు దూరంగా ఉండగా, రాయపాటి టీడీపీ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. మిగతా వారందరూ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.

ఇక జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన సబ్బం హరి, పోలింగ్ కు ముందురోజు పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబుకు మద్దతునిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక, జై సమైక్యాంధ్రలో ఉండి... టీడీపీలోకి చేరిపోయిన మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు ఓడిపోయారు.

  • Loading...

More Telugu News