: సీమాంధ్ర రాజధానిగా గుంటూరు-విజయవాడ!
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పరోక్షంగా పలు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజయవాడలోనే ప్రయాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. పైగా, గుంటూరులో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడి నుంచి వారంలో మూడు రోజుల పాటు పరిపాలన నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అటు చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలకు, ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల వాసులకు విజయవాడ-గుంటూరు ప్రాంతం సమాన దూరంలో ఉంటుంది. అన్ని ప్రాంతాల నుంచి చక్కటి రైలు, రోడ్డు కనెక్టివిటీ ఉంది. తాగు నీటికి సమీపంలోనే ప్రకాశం బ్యారేజీ, ఆపై పులిచింతల ప్రాజెక్టులు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరు, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరును వ్యవసాయాధారిత పారిశ్రామిక కేంద్రంగా, విజయవాడను ఆటోమొబైల్ పరిశ్రమల హబ్ గా చేస్తానని ఆయన వెల్లడించారు.