: పాతికేళ్ల తర్వాత విశాఖకు స్థానిక ఎంపీ
ఏళ్ల తరబడి స్థానికేతర ఎంపీల నీడలో ఉన్న విశాఖపట్నం పాతికేళ్ల తర్వాత స్థానిక వ్యక్తిని ఎంపీగా గెలిపించుకుంది. 1984లో స్థానికుడైన భాట్టం శ్రీరామమూర్తి టీడీపీ నుంచి పోటీ చేసి ఇక్కడి నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. మళ్లీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో వెలువడిన ఫలితాల్లో స్థానికుడైన కంభంపాటి హరిబాబు విశాఖ ఎంపీగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఇక్కడే ఆంధ్ర యూనివర్శిటీ ప్రొఫెసర్ గా పని చేసిన కంభంపాటి కొంతకాలం కిందట రిటైర్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో పని చేస్తూ వస్తున్నారు. తొలిసారి పోటీ చేసినప్పటికీ భారీ విజయాన్ని దక్కించుకున్నారు.
ఇక విశాఖ నుంచి 1989లో స్థానికేతరుడైన అనంద గజపతిరాజు మాజీ భార్య ఉమ కాంగ్రెస్ టికెట్ పై ఇక్కడ విజయం సాధించారు. 1996, 98ల్లో నెల్లూరు జిల్లాకు చెందిన టి.సుబ్బరామిరెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. 1991, 99ల్లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 'గీతం' విద్యాసంస్థల అధినేత ఎంవివిఎస్ మూర్తి ఇక్కడి నుంచే లోక్ సభకు ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన దివంగత ఎన్ జనార్ధన్ రెడ్డి 2004 ఎన్నికల్లో విశాఖ నుంచే పార్లమెంటు సభ్యుడయ్యారు. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుబాటి పురందేశ్వరి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు.