: కుక్కల వ్యవహారంలో సినీనటి, మాజీ ప్రధాని కార్యదర్శి మధ్య జగడం
కుక్కల వ్యవహారం ఇద్దరు వీఐపీల మధ్య జగడం రేపింది. చెన్నై వలసరవాక్కంలో జానకీ నగర్ ఆరో వీధిలో సినీనటి సంగీత (ముత్యాలముగ్గు సంగీత కాదు) కుటుంబం నివాసం ఉంటోంది. అదే వీధిలోని ఓ ఇంట్లో మాజీ ఐఏఎస్, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కార్యదర్శి ఉషా శంకర్ నారాయణ్ చేరారు. కాగా ఆమె జంతు సంరక్షకురాలుగా ఉంటున్నారు. దీంతో ఆమె కొన్ని కుక్కలను చేరదీసి పెంచుకుంటున్నారు. ఆ కుక్కల కారణంగా సంగీత, ఉషాశంకర్ నారాయణ్ మధ్య వివాదం చోటుచేసుకుంటోంది.
కుక్కలను వీధిలోకి వదలడం వల్ల తమకు ఇబ్బందిగా ఉందని సంగీతతో పాటు కాలనీ వాసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మూగజీవాలను ఇబ్బందిగా భావించవద్దని ఆమె హితవు పలకడంతో ఆమె వ్యవహారం తమకు అభ్యంతరంగా ఉందని సంగీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఉషాశంకర్ నారాయణ్ పోలీసులకు ఎదురు కేసుపెట్టారు. సినీనటి సంగీత, ఆమె భర్త క్రిష్ ఇల్లు ఖాళీ చేయాలని, లేని పక్షంలో చంపుతామని బెదిరించారని ఆమె ఫిర్యాదు చేశారు.
దానిని పోలీసులు సీరియస్ గా తీసుకోకపోవడంతో, నటి సంగీత, ఆమె భర్త క్రిష్ 24 గంటల్లో ఇళ్లు ఖాళీ చెయాలని, లేదంటే కుక్కలతో పాటు తనను కూడ దహనం చేస్తామంటూ హెచ్చరించారని హైకోర్టులో కేసు వేశారు. ఉషాశంకర నారాయణన్ ఆరోపణలను నటి సంగీత ఖండించారు. పెంపుడు కుక్కల వ్యవహారం సినీ నటి సంగీత - మాజీ ప్రధాని పీవీ కార్యదర్శికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఎవరూ వెనకకు తగ్గకపోవడంతో వారిరువురూ శత్రువుల్లా తయారయ్యారు.