: మెదక్ ఎంపీ కుర్చీలో కూర్చునేదెవరు?
తెలంగాణలో అత్యధిక స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోవడంతో కేసీఆర్ సీఎం పదవి చేపట్టనున్నారు. దీంతో ఆయన మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ లోక్ సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపాలన్న అంశంపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. ముందుగా అక్కడి నుంచి పార్టీ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డిని బరిలోకి దింపాలని కేసీఆర్ భావించారు. అయితే, అందుకు నాయిని సుముఖంగా లేరు. తాను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కావాలనుకుంటున్నానని ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. దాంతో కేసీఆర్ ఇప్పుడు ఆ స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారిని రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి మరికాసేపట్లో తెలంగాణ భవన్ లో జరిగే ఎంపీ, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమై చర్చించనున్నారు.