: అబలలకు ఆపన్న హస్తం అందిస్తున్న సోదరులకు అమెరికా సత్కారం


కొంతమంది మృగాళ్లు మహిళలపై దుశ్చర్యలకు పాల్పడుతుంటే, ఆ సోదరులు మాత్రం మహిళలపై హింసను అణచివేసేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. మహిళలపై జరుగుతోన్న దారుణాలను అరికట్టేందుకు ఆపన్నహస్తం అందిస్తున్నారు ఈ ముగ్గురు సోదరులు. ప్రధానంగా భారతీయ మహిళల సాధికారతకు వీరు చేస్తున్నఅత్యున్నత పోరాటాన్ని, కృషిని అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ అభినందించారు. అంతేకాదు, అమెరికా ప్రతిష్ఠాత్మక 'వైటల్ వాయిసెస్ గ్లోబల్ లీడర్ షిప్' పురస్కారంతో ఈవారం మొదట్లో వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్ లో జరిగిన 'వైటల్ వాయిసెస్' వార్షిక వేడుకలో వారిని సత్కరించారు.

ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, హింసకు
అమెరికాలో ఉంటున్న భారతీయ సోదరులు రవి, రిషి, నిషి కాంత్ ఎంతగానో చలించిపోయారు. వీటిని ఎదుర్కోవడానికి ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2001లో 'శక్తి వాహిని' పేరిట స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. మహిళలపై హింసకు ముగింపు పలకడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో దాదాపు 2వేల మందికి, 70 శాతం మంది పిల్లలకు సంస్థ ద్వారా సహాయాన్ని అందించారు.

అంతేకాదు, హెల్ప్ లైన్ ద్వారా తమ గోడు చెప్పుకున్న 600 మంది పరువు హత్యల బాధితుల ఆర్తనాదాలకు స్పందించారు. వీరి కృషిని గుర్తించిన అమెరికా వీరిని సమున్నతంగా గౌరవించింది. ఎంతోమంది నుంచి ప్రశంసలు అందుకున్న'శక్తి వాహిని' సంస్థను స్థాపించడానికి తమ తల్లిదండ్రులే మార్గదర్శకులని సోదరుల్లో ఒకరైన నిషికాంత్ చెబుతున్నారు. మహిళలపై హింసను అరికట్టేందుకు పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు  తెలిపారు. 

  • Loading...

More Telugu News