: బంగ్లాదేశ్ లో మునిగిన పడవ... 250 మంది గల్లంతు
కొరియా పడవ ప్రమాదం దుర్ఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా దగ్గర్లోని మున్షిగంజ్ సమీపంలో మేఘనా నదిలో ఒక భారీ నౌక మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 250 మందికి పైగా గల్లంతయ్యారు. తుఫాను, భారీ వర్షం కారణంగానే పడవ మునిగిపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం సంభవించే సమయానికి పడవలో 250 నుంచి 300 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
పడవ మునిగిపోవడంతో అందులోని చాలా మంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని అధికారులు తెలిపారు. ఈ కారణంగా పడవ ప్రమాదంలో ఎంత మంది గల్లంతయ్యారన్నది కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. గల్లంతైన వారిని రక్షించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వాధికారులు సహాయక చర్యలు చేపట్టారు.