: యూనివర్సిటీ హాస్టల్ లో పీహెచ్ డీ విద్యార్థి అనుమానాస్పద మృతి
వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రంలో పీహెచ్ డీ చేస్తున్న రాహుల్ ప్రజాపతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇతను ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ జిల్లా షాగంజ్ ప్రాంతానికి చెందిన విద్యార్థి. విశ్వవిద్యాలయానికి చెందిన అయ్యర్ హాస్టల్ లో ఉంటున్న రాహుల్ తన గది నుంచి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో సహవిద్యార్థులు హాస్టల్ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో అధికారులు, విద్యార్థులు రాహుల్ గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ మంచంపై రాహుల్ మృతదేహాన్ని కనుగొన్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.